logo

కనిపించని ర్యాంకులు


10-Jun-2019 15:02IST
invisible ranks

ఇంట‌ర్ ఫ‌లితాల్లో ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డ్‌ చేసిన నిర్వాకానికి అమాయ‌క విద్యార్థులు ప్రాణాలు బ‌లి తీసుకున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఎప్పుడో రావాల్సిన ఎంసెట్‌ ఫలితాలు ఆదివారం (నిన్న‌) విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఈ ఫ‌లితాల్లో కూడా కొంత మంది విద్యార్థులకు వారి ర్యాంకులు కనిపించకపోవడం మ‌రో గందరగోళానికి గురిచేసింది. ఈ ఫలితాలను ప్రకటించిన జేఎన్‌టీయూ, ఇంటర్మీడియట్‌లో రెండో సంవత్సరం హాల్‌టికెట్‌ నంబరు ఇవ్వని వారికి, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి మార్కులు సేకరించకుండానే ఫలితాలను ప్రకటించింది.దీంతో దాదాపు 5,281 మంది విద్యార్థులకు వారి ర్యాంకులు మిస్సయ్యాయి. ఆ అభ్యర్థులు ఎంసెట్‌లో అర్హత సాధించినప్పటికీ ర్యాంకులు వెల్లడించలేదు. సీబీఎస్‌ఈ చెన్నై ప్రాంతీయ కార్యాలయ అధికారులు మార్కులు ఇచ్చేందుకు నిరాకరించినపుడు సాధారణ ర్యాంకుల వెల్లడికి ముందుగానే సరైన వివరాలు తీసుకునే ప్రయత్నం చేయకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంసెట్‌ దరఖాస్తులో కనీస అర్హత పరీక్షలైన ఇంటర్మీడియట్‌, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ ఒకేషనల్‌ తదితర కోర్సుల హాల్‌టికెట్‌ నంబరు నమోదు చేయాలి. దాదాపు 2 వేలకు పైగా విద్యార్థులు ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సరం హాల్‌టికెట్‌ నంబరుకు బదులుగా మొదటిసంవత్సరం నంబరును నమోదు చేశారు. ఇంటర్మీడియట్‌ ఫలితాల సమాచారాన్ని తీసుకున్నపుడు మార్కులు వెల్లడి కాలేదు. మరోవైపు సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ పరీక్షలు రాసి ఎంసెట్‌ రెండు విభాగాలకు కలిపి దరఖాస్తు చేసిన 2,623 మంది విద్యార్థులు ప్లస్‌టూ హాల్‌టికెట్‌ నంబరు నమోదు చేశారు. అభ్యర్థుల వివరాల్ని ఇవ్వాలని జేఎన్‌టీయూ హైదరాబాద్‌ అధికారులు పలుమార్లు సీబీఎస్‌ఈ బోర్డుకు వెళ్లినా అక్కడి అధికారులు ఇచ్చేందుకు నిరాకరించారు. ఈ నేపథ్యంలో ర్యాంకుల ప్రకటనకు ముందుగానే సంబంధింత అభ్యర్థులకు వ్యక్తిగతంగా సమాచారం పంపించి, ఆ వివరాలు తీసుకునే ప్రయత్నం చేయలేదు.

Tags: eamcet ranks 2019 invisible

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top