logo

ప్రధాన చ‌ర్చంతా 5జి పైనే


29-Jun-2019 11:57IST
The main church is 5g

జి-20 సదస్సు సందర్భంగా మోడీ, ట్రంప్‌ భేటీ
జపాన్‌: ఇరాన్‌ నుంచి చమురు కొనుగోలు, 5జి సాంకేతికత, రక్షణ రంగంలో సహకారం, ద్వైపాక్షిక వాణిజ్యం ప్రధాన అజెండాగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, భారత ప్రధాని మోడీ మధ్య చర్చలు జరిగాయి. శుక్ర, శని వారాల్లో రెండు రోజుల పాటు జపాన్‌లోని ఒకాసాలో జి-20 దేశాల శిఖరాగ్ర సదస్సు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇరు దేశాల అధినేతలు సమావేశమై పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఇరాన్‌ నుంచి చమురు కొనుగోలు, టెలీ కమ్యూనికేషన్‌ విభాగంలో 5జి సాంకేతికత, రక్షణ రంగంలో సహకారమే అజెండాగా ఈ భేటీ జరిగింది. తమ ఎగుమతులపై విధిస్తున్న భారీ సుంకాలను భారత్‌ తగ్గించాలని ట్రంప్‌ హుకుం జారీ చేసిన తరువాతి రోజునే ఈ సమావేశం జరగడం గమనార్హం. ఇటీవల ఎన్నికల్లో గెలుపొందిన తనకు ఫోన్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన ట్రంప్‌కు మోడీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. భారత్‌తో సంబంధాల మెరుగుదలకు ట్రంప్‌ ఆసక్తి కనపరుస్తున్నట్లు ఇటీవల ఆ దేశ విదేశాంగశాఖ మంత్రి ఒక లేఖను అందించారని అన్నారు. అనంతరం ట్రంప్‌ మాట్లాడుతూ రక్షణ, వాణిజ్య రంగాల్లో భారత్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ''ఇరు దేశాల మధ్య స్నేహబంధం కొనసాగుతుందని హామీ ఇస్తున్నాను. ఎన్నికల్లో విజయం మీ(మోడీ) శ్రమకు గుర్తింపు. సైనిక, రక్షణ రంగాలతో పాటు ఇతర రంగాల్లో రెండు దేశాలు కలిసి పనిచేస్తాయి. వాణిజ్య, ఉత్పత్తి రంగాలపై తదుపరి సమావేశాల్లో చర్చించుకుంటాం'' అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ఇరాన్‌కు సంబంధించి ట్రంప్‌ మాట్లాడుతూ ''మనకు చాలా సమయం ఉంది. తొందరేం లేదు. వారు ఆలోచించుకుంటారు. దీనికి సంబంధించి సమయ పరిమితితో కూడిన ఒత్తిడేం లేదు.'' అని అన్నారు. 2015లో ఆరు దేశాలు చేసుకున్న అణుఒప్పందం నుంచి ఇరాన్‌ ఇటీవల బయటకు వచ్చింది. ఆ దేశంపై ట్రంప్‌ ఆంక్షల అస్త్రం ప్రయోగించారు. ఆ దేశం నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌తోపాటు ఇతర దేశాలను తదుపరి కొనుగోళ్లు చేయవద్దని హుకుం జారీ చేశారు. అమెరికా ఒత్తిడికి తలొగ్గిన భారత్‌ చమురు కొనుగోళ్లను నిలిపివేసింది.

బ్రిక్స్‌ దేశాల సమావేశం
ఉగ్రవాదంపై సంయుక్తంగా పోరాడాల్సిన అవసరం ఉందని బ్రిక్స్‌ దేశాలు ఉమ్మడిగా పేర్కొన్నాయి. ట్రంప్‌తో చర్చల అనంతరం బ్రిక్స్‌ దేశాల అనధికారిక సమావేశంలో మోడీ పాల్గొన్నారు. తమ కూటమిలోని భారత్‌, రష్యా, చైనా, బ్రెజిల్‌, దక్షిణాఫ్రికాల్లో ఉగ్రదాడులను ఖండిస్తున్నామని ఆయా దేశాలు పేర్కొన్నాయి. ఉగ్రవాద ఆర్థిక సహాయక చర్యలను అడ్డుకోవాలని పునరుద్ఘాటించాయి. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ ఉగ్రవాదంపై భారత్‌ చేస్తున్న పోరాటంలో ప్రపంచ దేశాలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదం వల్ల మానవ మనుగడకు తీవ్ర ముప్పు పొంచి ఉందని, దేశాల ఆర్థిక వ్యవస్థలు ఛిన్నాభిన్నమయ్యే ప్రమాదం ఉందని, సామాజిక అస్థిరతకు దారితీసే అవకాశం ఉందని హెచ్చరించారు. 'ప్రధానంగా ఆర్థికవ్యవస్థలో మాంద్యం, ఏకపక్ష నిర్ణయాలు, వాణిజ్య సంబంధాలు వంటి మూడు సవాళ్లపై దృష్టి సారించాలి' అని మోడీ అన్నారు. 

ఎస్‌-400పై చర్చించలేదు
ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ల మధ్య భేటీలో వాణిజ్యం, ఇరాన్‌ నుంచి చమురు కొనుగోలు, 5జి సాంకేతిక అంశాలపైనే చర్చలు జరిగాయని, రష్యా నుంచి ఎస్‌-400 క్షిపణి కొనుగోలుకు సంబంధించిన అంశంపై ఎటువంటి చర్చ జరగలేదని భారత విదేశాంగ శాఖ తెలిపింది. రక్షణ రంగానికి చెందిన కొన్ని అంశాలపైనే వీరిద్దరూ చర్చించారని విదేశాంగశాఖ కార్యదర్శి విజరు గోఖలే మీడియాకు వెల్లడించారు. 

మోడీ మాటలు కొత్తకాదు
ఉగ్రవాదానికి సంబంధించి జి-20 సదస్సులో మోడీ చేసిన వ్యాఖ్యలపై జమ్మూకాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా స్పందించారు. 'ఆయన చేసిన వ్యాఖ్యలు కొత్తేం కాదు. అవి ఎప్పుడూ చెప్పేవే' అని అన్నారు. అమెరికా ఎగుమతులపై భారత్‌ విధిస్తున్న సుంకాలపై ట్రంప్‌ చేసిన బెదిరింపులపై ఆయన మాట్లాడుతూ 'ట్రంప్‌ మనకు మంచి గుణపాఠం నేర్పించాడు. పన్నులు తగ్గించాలని ఆయన డిమాండ్‌ చేస్తున్నారు.' అని వ్యాఖ్యానించారు. 

Tags: g20 summit world leaders talk about 5g

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top