కర్నాటక: కర్ణాటక రాజకీయం మరో మలుపు తిరిగింది. స్వతంత్ర ఎమ్మెల్యేల పిటిషన్పై విచారణను సుప్రీం కోర్టు రేపటికి వాయిదా వేసింది. కర్ణాటకలో మంగళ లేదా బుధవారాల్లో బలపరీక్ష పూర్తవుతుందని కోర్టు ఆశాభావం వ్యక్తం చేసింది. బల పరీక్షను వెంటనే జరపాలని స్వతంత్ర్య ఎమ్యెల్యేలు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేల తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి వాదిస్తూ ఇవాళ సాయంత్రం 6గంటల లోపు బలపరీక్ష నిర్వహించేలా ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు. ఈ పిటిషన్ను తక్షణమే విచారణకు స్వీకరించాలని సుప్రీంను స్వతంత్ర ఎమ్మెల్యేలు సోమవారం కోరగా.. వారి అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. ఇక అసెంబ్లీ వ్యవహారాల్లో గవర్నర్ జోక్యాన్ని నిరసిస్తూ కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, విప్ అంశంపై కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య కూడా సుప్రీంను ఆశ్రయించారు. ఈ మూడు వ్యాజ్యాలపై సుప్రీం ఈరోజు విచారించే అవకాశం ఉందని భావించారు. కోర్టు తీర్పు ఆధారంగానే స్పీకర్ నిర్ణయం ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ, తాజాగా స్వతంత్ర ఎమ్మెల్యేల పిటిషన్పై విచారణను సుప్రీం రేపటికి వాయిదా వేయడంతో.. బలపరీక్ష ఏ దిశగా సాగుతుందనేది ఉత్కంఠగా మారింది.