logo

ఎట్టకేలకు బోణి కొట్టిన తెలుగు టైటాన్స్


12-Aug-2019 13:03IST
telugu titan beats gujarathfortunegiants 3024

బాహుబలి సిద్దార్థ్‌ దేశాయ్‌ (7) రాణించడంతో, ప్రొ కబడ్డీ లీగ్‌ ఏడో సీజన్‌లో తెలుగు టైటాన్స్‌ బోణీ కొట్టగలిగింది . ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ 30-24తో గుజరాత్‌ ఫార్చ్యూన్‌ జెయింట్స్‌పై గెలిచి విజయాల ఖాతాను తెరిచింది. రైడింగ్‌లో బాహుబలి, ట్యాక్లింగ్‌లో విశాల్‌ భరద్వాజ్‌ (7) చెలరేగడంతో టైటాన్స్‌ విజయాన్ని సొంతం చేసుకుంది. మ్యాచ్‌ మొత్తంలో 16 టాకిల్‌ పాయింట్లు, 11 రైడ్‌ పాయింట్లతో ప్రత్యర్థిని టైటాన్స్‌ రెండు సార్లు ఆలౌట్‌ చేసింది. గుజరాత్‌ తరఫున పర్వేష్‌ భైంస్వాల్‌ 7 టాకిలింగ్‌ పాయింట్లతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

తొలి ఆరు నిమిషాలకే ప్రత్యర్థిని ఆలౌట్‌ చేసిన టైటాన్స్‌, 9-4తో ఆధిక్యంలో నిలిచింది. సిద్దార్థ్‌ దేశాయ్ తో పాటు డిఫెండర్లు సత్తాచాటడంతో ఈ ఫీట్ సాధించగలిగింది. కొద్దిసేపటి వరకు, రైడర్లు రోహిత్‌ గులియా (5), సచిన్‌ (4) నిలువరించే ప్రయత్నం చేసినా గుజరాత్‌ పుంజుకోలేకపోయింది. టైటాన్స్‌ ఆటగాళ్లు దూకుడు కొనసాగించి 17-13తో తొలి అర్ధ భాగాన్ని ముగించారు.

సెకండ్ హాఫ్ లో రెండు జట్లు పాయింట్ల కోసం తీవ్రంగా పోటీపడగా,  టైటాన్స్‌ ఒకింత వ్యూహాత్మకంగా ఆడి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టి మ్యాచ్‌పై పట్టుసాధించింది. 30 నిమిషాల ఆటముగిసే సరికి 24-19తో టైటాన్స్‌ పైచేయి సాధించింది. ఆఖర్లో ప్రత్యర్థికి ఎలాంటి అవకాశాన్ని ఇవ్వని టైటాన్స్‌.. ఈ సీజన్‌లో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. 

Tags: telugu titans beats gujarathfortunegiants

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top