అఖండ భారతావనిలో కీలకమైన న్యాయవ్యవస్థలో భాగమైన సుప్రీమ్ కోర్టును ఒక్కచోటికే పరిమితం చేయడంపై భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. సుప్రీమ్ కోర్టు బెంచ్‌లను దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలన్న అభ్యర్థనలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. దేశంలోని నాలుగు ప్రాంతాల్లో సుప్రీమ్ కోర్టు బెంచులు ఏర్పడితే ఆయా ప్రాంతాల వారికి అత్యున్నత న్యాయవ్యవస్థ అందుబాటులో వస్తుందన్న వాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలుస్తోంది. కాగా, సుప్రీంకోర్టు రీజనల్ బెంచ్‌ల ఆవశ్యకత ఫై ఇటీవల చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా, వివిధ రీజియన్లలో ప్రత్యేకంగా సుప్రీంకోర్టు బెంచ్‌లు ఉండాలన్న లా అండ్ జస్టిస్ పార్లమెంటరీ స్టాడింగ్ కమిటీ సిఫార్సులకు వెంకయ్యనాయుడు మద్దతు తెలిపారు.
దేశంలోని నాలుగు ప్రాంతాల్లోని ముఖ్య పట్టణాల్లో సుప్రీంకోర్టు బెంచ్‌లు ఏర్పడితే, భారీగా పేరుకుపోయిన పెండింగ్ కేసులకు మోక్షం లభిస్తుంది. సుప్రీమ్ కోర్ట్ బెంచ్ ల ఏర్పాటులో భాగంగా దక్షిణ ప్రాంతం నుంచి హైదరాబాద్ నగరం అనువైనదిగా ఉంటుందని, అది కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని తెలుస్తుంది. దూరం, భారీ వ్యయం కారణంగా దక్షిణాది కక్షిదారులు ఢిల్లీకి వెళ్లలేకపోతున్నారని, వారి అవసరాలను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్‌లో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటుచేయాలని దక్షిణాది ప్రాంతానికి చెందిన వారు విజ్ఞప్తి చేస్తున్నారు.