logo

గన్నుతో బెదిరిస్తున్నా... తాపీగా దమ్ము కొడుతున్నాడు..!


04-Sep-2019 16:43IST
man enjoys smoking while thief threatens with gun

అమెరికా, సెయింట్ లూయిస్ నగరంలోని ఓ బార్ లో.. ఒక విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. సమయం అర్ధరాత్రి 12.34 గంటలు, బార్ లో ఉన్నవారు మత్తులో జోగుతున్న సమయం అది, అంతలో ఓ గుర్తు తెలియని వ్యక్తి గన్నుతో బార్‌లోకి ప్రవేశించాడు. అది చూసిన వారందరు ఒక్కసారిగా హడలిపోయారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని, నేలమీద పడుకున్నారు. 
 
గన్ తో ఉన్న దుండగుడు బార్ లో ఉన్న వారందరిని బెదిరిస్తూ.. కౌంటర్ వద్దకు చేరుకున్నాడు. అక్కడే ఉన్న టోనీ టొవర్ అనే కస్టమర్ దగ్గరకు వెళ్లి, అతని  ఫోన్‌ లాక్కునే ప్రయత్నం చేశాడు. టోనీ అతనిని ప్రతిఘటించాడు. దుండగుడు గన్ తో వీరంగం సృష్టిస్తున్నా..టోనీ మాత్రం బెదరక పోగా... తాపీగా దమ్ముకొడుతున్నాడు.  
టోనీ చర్యలను గమనిస్తున్న దుండగుడు, అతనితో లాభం లేదని.. బార్ లో ఉన్న మిగతా వారిని దోచుకోవడం ప్రారంభించాడు.  

ఇదంతా చూస్తూనే ఉన్న టోనీలో మాత్రం కొంచెం కూడా భయం కనిపించలేదు, పైగా కౌంటర్ వద్దే ధూమపానాన్ని ఆస్వాదిస్తూ కూర్చుకున్నాడు. ఈలోపు దుండగుడు అందరినీ బెదిరించి వారి వద్దనున్న డబ్బులు దోచేశాడు. అక్కడే ఉన్న టోనీ జోలికి మాత్రం రాలేదు. ఈ తతంగం అంతా సీసీకెమెరాల్లో రికార్డ్ అయ్యింది.  దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు, అక్కడికి చేరుకొని విచారణ ప్రారంభించారు. సీసీకెమెరాలను పరిశీలించిన పోలీసులు, టోనీ ప్రదర్శించిన ధైర్యానికి మెచ్చుకోకుండా ఉండలేకపోయారు.   

పోలీసులు అతనితో మాట్లాడగా... అతను ఇటువంటి వారిని చాలా మందిని చూసాను కానీ, నేను వారికి భయపడనని పోలీసులకు సమాధానం చెప్పాడు. దుండగుడు ఎవరి ప్రాణాలు తీయడానికి రాలేదని అనిపించటంతో... అలా కూల్ గా ఉండగలిగానని టోనీ పోలీసులతో చెప్పాడు. కాగా..ఈ దోపిడీకి పాల్పడ్డ వ్యక్తిని కెవిన్ మూర్‌గా గుర్తించారు పోలీసులు. 

Tags: tony tover enjoys smoking thief threatens gun

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top