logo

సిరుల‌త‌ల్లికి స్న‌ప‌న తిరుమంజ‌నం


30-Nov-2019 12:47IST
padmavati ammavari brahmotsavam

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, నవకలశాభిషేకం, రాజోపచారం  నిర్వహించారు. అనంతరం ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం చేపట్టారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా క్షీర(పాలు), దధి(పెరుగు), మది(తేనె), నారికేళం(కొబ్బరినీళ్లు), హరిత్రోదకం(పసుపు), గంధోధకం(గంధం)తో స్నపనం నిర్వహించారు. అనంత‌రం శంఖధార, చక్రధార, సహస్రధార, మహాకుంభాభిషేకాలను పాంచరాత్ర ఆగమయుక్తంగా నిర్వహించారు.  తెల్ల త‌మ‌ల‌పాకులు, వ‌క్క‌గింజ‌లు, ప‌ట్టువ‌స్త్రాలు తదితర మాల‌ల‌తో సిరుల‌త‌ల్లికి క‌డుర‌మ‌ణీయంగా స్నపన తిరుమంజనం జరిగింది.  ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో ప్రత్యేకంగా ఫల పుష్పాలతో రూపొందించిన మండపంలో శ్రీపాంచరాత్ర ఆగమశాస్త్రబద్ధంగా ఈ వేడుక నిర్వ‌హించారు.

 ఈ వేడుకలో ఒకో క్రతువులో ఒక మాల వంతున మొత్తం ఎనిమిది రకాల మాలలను అమ్మవారికి అలంకరించారు. ఇందులో తెల్ల త‌మ‌ల‌పాకులు, వ‌క్క‌గింజ‌లు, ప‌ట్టువ‌స్త్రాల మాల‌, తెలుపు అన‌ప‌కాయ‌లు, నెల్లికాయ‌లు, తెలుపు చెర్రీలు, న‌ల్ల ద్రాక్ష‌, చివ‌రిగా తుల‌సి మాల‌ల‌ను అమ్మవారికి అలంకరించారు. మ‌ధ్య‌లో ప‌లుర‌కాల ఫ‌లాల‌ను నివేదించారు.  టిటిడి ఉద్యాన‌వ‌న విభాగం డెప్యూటీ డైరెక్ట‌ర్ శ్రీ శ్రీ‌నివాసులు ఆధ్వ‌ర్యంలో మాల‌ల‌ను రూపొందించారు. కంకణభట్టర్‌ శ్రీ వేంప‌ల్లి శ్రీ‌నివాసులు ఆధ్వర్యంలో జ‌రిగిన ఈ విశేష కార్య‌క్ర‌మానికి  శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్ స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్ స్వామి పాల్గొన్నారు. . 


Tags: padmavati ammavaru ttd tiruchanuru brahmotsavam

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top