logo

నేడు సుబ్ర‌హ్మ‌ణ్య ష‌ష్టి


02-Dec-2019 08:22IST
subramanya shashti today

లోకసంరక్షనార్ధం తారకాసురున్నివధించేందుకై దేవతలకోరిక మేరకు లోక నాయకుడు పరమశివుడు అంశతో మార్గశిర శుద్దషష్టి నాడు జన్మించారు సుబ్రహ్మణ్య స్వామి. ఈ మార్గశిర షష్టిని "సుబ్రహ్మణ్య షష్టి" లేదా "స్కంద షష్టి"గా పిలువబడుతోంది.

దేవసేనాధిపతి సుబ్రహ్మణ్య స్వామి:
పూర్వము "తారకాసురుడు" అనే రాక్షసుడు శివుని మెప్పుకై తీవ్రముగా తపస్సు చేసి తపోఫలముగా (అర్భకుడైన) బాలునితో తప్పఇతరులతో చావు లేని వరము పొందుతాడు. తదుపరి  తాను అజేయుడునని, అమరుడునని వరగర్వముతో ముల్లోకాలను గజగజలాడించగా దేవతలు విష్ణువు వద్దకువెళ్ళి మొరపెట్టుకుంటారు. తదుపరి ఆ శ్రీహరి వరమిచ్చిన ఆ పరమశివుని పుత్రుని వలెనే తారకాసురుని మరణం సంభవిస్తుందని తెలిపి ఆ ఆదిదేవునివద్దకు వెళ్లి సమస్యను విన్నవించుకోమని సెలవివ్వగా దేవతలు పరమశివుని వద్దకు వెళ్తారు.పరమశివుడు సమస్య తీవ్రతను గ్రహించి తన అంశతో సుబ్రహ్మణ్య స్వామి జన్మకు కారకులయ్యారు.

సుబ్రహ్మణ్యస్వామి జన్మ వృత్తాంతం :
పూర్వం మూడులోకాలను భయభ్రాంతులను చేస్తూ బాధిస్తున్న"తారకా సురుడు" అను రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై! దేవతలు బ్రహ్మ దేవుని శరణువేడినారు. దానికి బ్రహ్మ వారికి ఒక సూచన చేసినారు. ఈ తారకాసురుడు అమిత తపోబలసంపన్నుడు, అమితబలశాలి, వీనికి ఈశ్వర తేజాంశ సంభవుని వల్లకాని వానికి మరణములేదు. కావున! మీరు సతివియోగ దుఃఖముతో ఉన్న ఈశ్వరునకు ఆ సతీదేవియే మరుజన్మయందు గిరిరాజు హిమవంతునకు పుత్రికగా అవతరించిన ఆ పార్వతీదేవికి వివాహం జరిపిం చండి. వారికి కలుగు పుత్రుడే తారకాసురుని సంహరించగల సమర్ధుడు అవు తాడు అని తరుణోపాయం శెలవిచ్చారు.

అప్పటికే తపోదీక్షలో ఉన్న పరమశివునకు సేవలు చేస్తున్న ఆ జగన్మాత పార్వతికి, శివునకు అన్యోన్యత చేకూర్చే వాతావరణాన్ని కల్పించేందుకు! దేవతలు మన్మధుని ఆశ్రయిస్తారు. మొత్తం మీద మన్మధుని పూలబాణాలతో ఈశ్వరుని చలింపచేసి తాను ఈశ్వరుని ఆగ్రహానికి గురు అయినా! పార్వతి పరమేశ్వరుల కళ్యాణానికి మన్మధుడు కారణ భూతుడవుతాడు. కళ్యాణం అనంతరం దేవతల అభ్యర్ధనమేరకు పునర్జీవింపబడతాడు.

ఇలా ఉండగా! పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయానందసమయాన అగ్ని దేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు. అది గ్రహించిన పరమ శివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రునిలోకి ప్రవేశ పెడతాడు. దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగానదిలో విడచి పెడ తాడు. ఆ తేజము ఆ సమయమందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్‌కృత్తి కల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది. ఆ రుద్రతేజమును వారు భరించలేక రెల్లుపొదలో విసర్జిస్తారు. అంత ఆ ఆరుతేజస్సులు కలసి ఆరుముఖాలతో ఒక దివ్యమైన బాలుడుగా ఉద్భవిస్తాడు. ఇది తెలిసిన పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతునిగా ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకుని కైలాసం తీసుకుని వెళతారు.

ఆ బాలుడు గంగాగర్భంలో తేజోరూపంలో ఉన్నందుకు గాంగేయుడని, షట్‌ కృత్తికలు వానిని పెంచి పెద్దచేసిన కారణం వల్ల మరియు ఆరుముఖాలు కల వాడు అగుటవల్ల షణ్ముఖుడని, కార్తికేయుడని, అతడు గౌరీశంకరుల పుత్రుడ గుటచే కుమారస్వామి అనియు, సుబ్రహ్మణ్యస్వామి అనియు నామాలతో పిలువసాగిరి.

కారణజన్ముడైన ఈ స్వామి పార్వతి పరమేశ్వరులు, దేవతలు కోరిక మేరకు కుమారస్వామిగా చేసి, వానిని దేవతల సర్వసైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు "శూలం" మొదలైన ఆయుధాలను ఇవ్వగా, ఆ జగన్మాత పార్వతి కుమారుని దీవించి "శక్తి" అను ఆయుధాలను ఇచ్చి సర్వశక్తివం తుడ్నిచేసి, తారకాసురునిపై యుద్ధ శంఖారావాన్ని మ్రోగిస్తారు. అంత ఆ స్వామి నెమలి వాహనారూఢుడై ఆరుముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపం దాల్చి ఆరు చేతులతో ధనస్సులను మరో ఆరు చేతులతో బాణాలు ధరించి కొన్ని అక్షౌహిణులను సంహరించి, రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలచి "సర్పరూపం" దాల్చి వారిని ఉక్కిరి బిక్కిరి చేసి, భీకర యుద్ధము చేసి తారకాసురుని సంహరించి విజయుడైనాడు.

సుబ్రహ్మణ్యస్వామి పేర్లు :
కుమారస్వామికి గల విశిష్ట నామాలు వాటి వివరణ ఈ క్రింది విధంగా వున్నవి.
షణ్ముఖుడు --------------> ఆరు ముఖాలు కలవాడు.
స్కందుడు ----------------> పార్వతీదేవి పిలిచిన పేరు.
కార్తికేయుడు --------------> కృత్తికానక్షత్రాన జన్మిచినందుకు లభించిన నామం.
వేలాయుధుడు ------------> శూలాన్ని ఆయుధముగా కలిగిన వాడు.
శరవణుడు -----------------> శరవణం (రెల్లు వనం) లో జన్మించెను కాబట్టి.
గాంగేయుడు ---------------> గంగానది ప్రవాహంలో వఛ్చినవాడు.
సేనాపతి -------------------> దేవతలకు సేనాధిపతి కనుక.
స్వామినాధుడు -----------> శివునకు ప్రణవ మంత్రము అర్ధాన్ని చెప్పినాడు కనుక.
సుబ్రహ్మణ్యుడు -----------> బ్రహ్మ జ్ఞానము కలిగినవాడు.
మురుగన్ -----------------> ఈ తమిళ నామాని అర్ధం "అందమైన వాడు"

తారకాసుర సంహారం:
కుమారస్వామిని దేవతలు తమ సేనాధిపతిని చేసారు. కుమారస్వామి తారకా సురిని సంహరించేందుకు భీకరయుద్దాన్ని ఆరు రోజుల పాటు చేసి వధించి లోకాన్ని, దేవతలను కాపాడి అందరి మన్ననలు పొందిన సుబ్రహ్మణ్యస్వామి దేవసేనాపతి గా కీర్తింపబడ్డారు. 

సుబ్రహ్మణ్య కావడి:
విశేషముగా సుబ్రహ్మణ్య షష్ఠి రోజున భక్తులు తెల్లవారే లేచి శిరస్నామచారించి పాలు, పంచాదరాలతో నిండిన కావిడలను ధరించి సుబ్రహ్మణ్య స్వామికి సమర్పిస్తారు. దేవాలయాలను దర్శించి భక్తిశ్రద్ధలతో  అష్టోత్తర శతనామాల పూజలు చేస్తారు. భక్తులు కావడిలతో తెచ్చిన పంచదార, పాలను స్వామికి సమర్పించుకుంటారు. అయితే ఈ కావడిలోని వస్తువులు భక్తుల మొక్కుల బట్టి ఉంటాయని తెలుస్తున్నది. ముఖ్యముగా ఈ ఆచారము తమిళనాడు రాష్ట్రములో విశేషముగా ఆచరణలో ఉన్నది. 

శ్రీ వల్లిదేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణము:
స్కంద షష్టి రోజునాడు సుబ్రహ్మణ్య దేవాలయాలలో "శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి" కళ్యాణం నిర్వహిస్తుండడం పరిపాటి. ఈ వివాహాన్ని వీక్షించిన వివాహంకాని యువతీయువకులకు ఆటంకములు తొలగి వివాహాలు జరుగుతాయని చెబుతుంటారు. అంతేకాకుండా వీరికి సత్సంతానము కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు.

సుబ్రహ్మణ్య షష్ఠి నాడు పాటించాల్సిన నియమాలు :
సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి.
నదీస్నానం ఆచరించాలి (సమీపాన నది ఉంటే) లేదా  శిరస్నానం చేయాలి. 
సుబ్రహ్మణ్య స్వామి కి పాలు నైవేద్యంగా సమర్పించాలి. 
అచంచల భక్తి భావంతో సుబ్రహ్మణ్య స్వామి గాధలు చదవాలి. 
సుబ్రహ్మణ్య స్వామి కీర్తనలు ఆలాపన చేయాలి.
దగ్గరలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలను సందర్శించి పూజలు చేయాలి.
వీలైనంత దానధర్మాలు చేయాలి.
రోజంతా ఉపవాస దీక్ష ఆచరించాలి.

స్కంద షష్టి పూజ ఫలితం:
## విశేషించి ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసినా, కావడి సమర్ఫిన్చినా సత్సంతాన ప్రాప్తి మరియు వారి కుటుంబములో మరియు రాబోయో తరాలవా రికి కూడా సంతాన లేమి లేకుండా వంశవృద్ధి జరుగుతుందని నమ్మకము. అందుకే సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు ఎక్కువగా మహిళలు సందర్శి స్తుంటారు.
## ఈ రోజు పుట్టలో పాలు పోసిన భక్తులకు సర్పదోషాలు తొలగిపోతాయని నమ్మకం. 
## స్కంద షష్ఠి నాడు సుబ్రహ్మణ్య  కళ్యాణం జరిపించు భక్తులకు సకలశుభాలు కలుగుతాయని ప్రతీతి.

Tags: subramanya shashti skanda shashti lord shiva parvati

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top